ఇశ్రాయేలు యింటివారలారా , మీరు నామాట వి నని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను , మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి , గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు .
మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
అయ్యో పరిసయ్యులారా , మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు . వాటిని మానక వీటిని చేయవలసి యున్నది .
ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.
ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపుదినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.
ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపుదినములు ఇవి.
మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.
ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను
మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు.
ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
యెహోవా మిమ్మునంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.
మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను
దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.
మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.
ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.
మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.
మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.
అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.
యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివగును.
ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుటమాని యెహోవాకు హోమము చేయవలెను.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.
ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.
ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశముచేసెదను.
అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమి్మదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.
వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు, మీ మ్రొక్కుబడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి దహనబలిద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవి.
ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.
అయితే ఏడవ నెల పదునయిదవ మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.
మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజిచెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.
అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.
నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను.ఇశ్రాయేలీయులలో పుట్టినవారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
నేను మీ దేవుడనైన యెహోవాను.
అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామకకాలములను తెలియచెప్పెను.
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.
మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను.
వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.
దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.
అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.
ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.
ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.
విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.
నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.
నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.
అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి.
వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱ పిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.
నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.
మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.
ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.
మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు
అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను
వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.
ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱ పిల్లతో ఒక్కొక్క పదియవవంతును
మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.
ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.
అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను.
ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.
మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.
యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱ పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను
ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును
ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను.
పస్కా పండుగలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండకూడదు.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు.
నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి
నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను.
ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయకూడదు.
ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వారములను లెక్కించి
నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది దాని నియ్యవలెను.
అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్యనున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
నీవు ఐగుప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.
నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.
ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను.
నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెనచొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.
నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పుతీర్చవలెను.
నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.
నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను.
నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు.
నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైన నిలువబెట్టకూడదు.
ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతిదినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు.
ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి . యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జను లందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి .
సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.
మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు.
కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు.
అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి .
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.