
వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింప లేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్ట లేదు .
మరియు -మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారముచేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను.
రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.
మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.
అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;
దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.
అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.
నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.
కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.
అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి.
తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండిపోయెను.
మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.
అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి
హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.
ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.
ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా -సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.
అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.
ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను.
అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి
జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.
నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించియున్నాను.
బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహమువలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు
సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతములనుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.
యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.
ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.
బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను.
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.
అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.
పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును
వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.
వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు
వారి విండ్లు ¸యవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు.
అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.
అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు
నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును
వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.
కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.
కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండనున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండనున్నాను.
నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.
వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను
నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.
జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును
సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను
ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.
నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.
దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు
కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.
అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.
తేమా దేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయముచేతను ఎక్కుపెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవుచున్నారు
ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.
కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.
తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.
సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి.
షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.
సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸యవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.
ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.
తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగలార్చుడి.
నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసినదిదేనా?
దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను?
సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను.
తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.
ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను.
మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు
ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.
తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను.
ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా
మరవబడిన వేశ్యా, సితారా తీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము.
డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.
వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.
నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థిం పని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయ వలెనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు.
నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించు చున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు... ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట.
డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి
గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.
నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.
నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి
ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది.నేనెక్కి భూమిని కప్పెదనుపట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.
గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.
ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు.
ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు
నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.
బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.
ఆయన అనేకులను తొట్రిల్లజేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.
ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.
పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే.
ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చేయున్నది.
పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.
శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడువలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే
లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయుదురు.
ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.
వారి ప్రాణము తీయజూచు బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.
నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.
నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైయున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనముచేసెదను అయితే నిన్ను సమూల నాశనముచేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు.
యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)
దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు.
నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని . నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని
నేను యెహోవాను , మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు .
వారు తండ్రిని నన్నును తెలిసికొన లేదు గనుక ఈలాగు చేయుదురు.
నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు.
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను .
మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు.
దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థనచేయువారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.
ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును .
వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు ?
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.