ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపుపండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమి్మనవారిని గద్దించితిని.
తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.
అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?
మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.
మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటిపడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని.
వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బసచేసికొనగా
నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని మీరు గోడచాటున ఎందుకు బసచేసికొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమున వారు మరి రాలేదు.
అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయముచొప్పున నన్ను రక్షించుము.
ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏపనియు చేయకూడదు.
ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపుదినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.
నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.
ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.
ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి.
విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీ పితరుల కాజ్ఞాపించి నట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి.
ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవనాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను.
ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.
ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను.
ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.
ఏడవ సంవత్సరము భూమికి మహావిశ్రాంతికాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.
నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.
అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.
మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంటఅంతయు మేతగా ఉండును.
తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.
ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకులము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.
మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.
మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పుచేసితివిు.
మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసివచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.
అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి
అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.
మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా?
నేనును నా బంధువులును నా దాసులునుకూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము.
ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.
అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.
మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపివేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి.
ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువురీతి యేదనగా
తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు.
అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు.
నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.
విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.
అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు3 అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను
అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని
వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.
కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.
అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;
నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.
అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని నప్పగించెను.
మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.