
లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.
కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి.
అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.
సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి.
అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.
తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి
సొదొమ గొమొఱ్ఱాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.
దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.
లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.
అట్లుండగా అక్క తన చెల్లెలితోమన తండ్రి ముసలి వాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.
మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.
ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.
మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలా గున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.
ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.
వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమి్మ అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.
దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.
దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.
అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.
కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.
తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.
అప్పుడు యెహోషువ నీవేల మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;
వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.
అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.
అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా
నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.
నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
అంతట అహాబు ఏలీయాను చూచి నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.
అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.
ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను
అంతట దైవ జనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని , యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని
నయమానును కలిసికొనుటకై పోవుచుండగా , నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీదనుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను . అతడు క్షేమమే అని చెప్పి
నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను .
అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి , తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని పోయిరి.
మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి .
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ , నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను .
అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రా లేదా ? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా ?
కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లెను.
వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.
వారు ఎడతెగక ఆశించినవారు తమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనజాలరు.
వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు.
వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికి వచ్చును.
వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.
ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.
అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.
వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును.
ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.
వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.
నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే;
నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?
అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.
కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు.
అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.
నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను,ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడుచున్నదంటిని.
అందుకతడు నాతో ఇట్లనెను - ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు - నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.
ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.
ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా
అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.
కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు,
ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియైయుండుట ఆవశ్యకమని చెప్పెను.
అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి
ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.
అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.
మేము కదల్చబడము, తరతరములవరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమి్మకయుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు.
ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును.
మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.
నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింప కపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి .
కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూ డనని అనుకొనుచున్నదానా , ఈ మాటను వినుము
ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును . నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును .
నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.