శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.
అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి , తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని పోయిరి.
మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి .
భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.
అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.
వారు నీతి క్రియలు చేయ తెలి యక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు .
మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.
తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు.
తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
నీవు చాల మంది జనములను నాశనముచేయుచు నీమీద నీవే నేర స్థాపనచేసియున్నావు, నీ దురాలోచనవలన నీ యింటి వారికి అవమానము తెచ్చియున్నావు.
గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తర మిచ్చుచున్నవి.
మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దిన మందు నేను శిక్షింతును.
అందుకతడు నాతో ఇట్లనెను - ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు - నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.
మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.
మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.
ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.
హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.
ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.
దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.
మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా , మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును ; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను .
తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను .
తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువది యైదు తులముల యెత్తును పదు నైదు తులముల యెత్తును ఉండవలెను .
ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు , బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు.
నేను ఐశ్వర్యవంతుడనైతిని , నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితము లో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచ లేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు .
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగ త్రాసుచేసి , మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో , మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా ,
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.