నేను ... జ్ఞాపకమునకు తెచ్చుకొని
యెహెజ్కేలు 16:8

మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధన చేసికొనగా నీవు నా దానవైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

లేవీయకాండము 26:42

నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

లేవీయకాండము 26:45

నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

నెహెమ్యా 1:5-11
5

ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

6

నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.

7

నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిు, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతివిు.

8

నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును.

9

అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడనుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.

10

చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.

11

యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

కీర్తనల గ్రంథము 105:8

తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధనను

కీర్తనల గ్రంథము 106:45

వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకముచేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

యిర్మీయా 2:2

నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగానీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸యవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

యిర్మీయా 33:20-26
20

యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగాదివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

21

నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.

22

ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.

23

మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

24

తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.

25

యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుపగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల

26

భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.

హొషేయ 2:15

అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్ల నిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు

లూకా 1:72

దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను.

నేను .... దాని స్థిరపరతును
యెహెజ్కేలు 37:26

నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.

యెహెజ్కేలు 37:27

నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.

యెషయా 55:3

చెవి యొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

2 సమూయేలు 23:5

నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

యిర్మీయా 31:31-34
31

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32

అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33

ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34

నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

యిర్మీయా 32:38-41
38

వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.

39

మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గ మును దయచేయుదును.

40

నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.

41

వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.

యిర్మీయా 50:5

ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.

హొషేయ 2:19

నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును.

హొషేయ 2:20

నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.

హెబ్రీయులకు 8:10

ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలైయుందురు.

హెబ్రీయులకు 12:24

క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

హెబ్రీయులకు 13:20

గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,