సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతర ముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభి వృద్ధిపొంది విస్తరించును.
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.
సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
యెహోవా , నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు .
జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువబెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చును.
ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు
వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు
మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను.
వారి కుమారులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి నందరిని శిక్షించెదను.
ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.
వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.
నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.
మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.
అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్ల నిత్తును ; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును , పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు , ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు , వనములు వేసి వాటి పండ్లను తిందురు .
వారి దేశ మందు నేను వారిని నాటుదును , నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు .
నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము . బాషానులోను గిలాదులోను వారు పూర్వ కాలమున మేసినట్టు మేయుదురు .
ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును.
నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.