ఫీనెహాసు
సంఖ్యాకాండము 25:7-13
7

యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,

8

సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను.

9

ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.

10

అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

11

వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

12

కాబట్టి నీవు అతనితో ఇట్లనుము–అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

13

అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

యెహొషువ 22:13

ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి.

యెహొషువ 22:30-32
30

ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి.

31

అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోను మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవా చేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించి యున్నారని చెప్పెను.

32

యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులును గిలాదులోని రూబేనీయుల యొద్దనుండియు, గాదీయుల యొద్దనుండియు ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా

యెహొషువ 24:33

మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

నిలుచువాడు
ద్వితీయోపదేశకాండమ 10:8

నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.

ద్వితీయోపదేశకాండమ 18:5

నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనియున్నాడు.

యుద్ధమునకు పోదుమా,మానుదుమా?
యెహొషువ 7:7

అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు.

1 సమూయేలు 14:37

సౌలు -ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తర మియ్యక యుండెను.

1 సమూయేలు 23:4-12
4

దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెను-నీవు లేచి కెయీలాకు వెళ్లుము , ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా

5

దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి . ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను .

6

అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నొద్దకు వచ్చెను .

7

దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించె ననుకొనెను .

8

కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జను లందరిని యుద్ధమునకు పిలువనంపించెను .

9

సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తె మ్మనెను .

10

అప్పుడు దావీదు -ఇశ్రాయేలీయుల దేవా యెహోవా , సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకురూఢిగా తెలియబడి యున్నది.

11

కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా ? నీ దాసుడనైన నాకు వినబడి నట్లు సౌలు దిగివచ్చునా ? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా , దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను .

12

కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవా -వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను .

1 సమూయేలు 30:8

నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా-తరుము , నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను .

2 సమూయేలు 5:19-24
19

దావీదు –నేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్ద విచారించినప్పుడు –పొమ్ము,నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.

20

కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి –అచ్చట వారిని హతముచేసి, జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నాశత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను2 పేరు పెట్టెను.

21

ఫలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి.

22

ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

23

దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా –నీవు వెళ్లవద్దు –చుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగా వారిమీద పడుము.

24

కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను.

2 సమూయేలు 6:3

వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.

2 సమూయేలు 6:7-12
7

యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.

8

యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్‌1 ఉజ్జా అను పేరు పెట్టెను.

9

నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున –యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి

10

యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను.

11

యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.

12

దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.

సామెతలు 3:5

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము

సామెతలు 3:6

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

యిర్మీయా 10:23

యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.

వెళ్లుడి
న్యాయాధిపతులు 1:2

యెహోవా ఆ దేశమును యూదావంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 7:9

ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.

2 దినవృత్తాంతములు 20:17

ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చినిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.