ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.
ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.
ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?
యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.
ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొన గోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,
వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.