అప్పుడు నిన్ను చూచు వారందరు నీయొద్ద నుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.
అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు
నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును
వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.
అది రేయిం బగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తర తరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు
గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతు లందరు గతమై పోయిరి .
ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును
అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును
చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును .
నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.
నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.
ఈలాగున నీవు ప్రకటింపవలెను యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.
ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.
దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గంపులుగా కూడును; గూడ బాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కను పించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.
నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.
నేను అన్య జనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసి యున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపుర ముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి -ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
నేను నీళ్లవలె పారబోయబడియున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
అతని ముఖము వికారమాయెను , అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను .
కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండనున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండనున్నాను.
మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.