షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు
1 రాజులు 10:1

షేబ దేశపురాణి యెహోవా నామమును... గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.

1 రాజులు 10:2-13
2

ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా

3

ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను.

4

షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,

5

అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై

6

రాజుతో ఇట్లనెను నీ కార్యములనుగూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే;

7

అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి;

8

నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు

9

నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.

10

మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.

11

మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.

12

ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.

13

సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినది పోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

మత్తయి 12:42

విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

లూకా 11:31

దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారి తో కూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును . ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యం తముల నుండి వచ్చెను , ఇదిగో సొలొమోనుకంటె గొప్పవా డిక్కడ ఉన్నాడు.

షేబ
ఆదికాండము 10:7

కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.

ఆదికాండము 10:28

ఓబాలును అబీమాయెలును షేబను

ఆదికాండము 25:3

యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.

ప్రసిద్ధిని
2 దినవృత్తాంతములు 1:1

దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజునుగా చేసెను.

2 దినవృత్తాంతములు 1:12

కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్యబడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.

1 రాజులు 4:31

అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రాహీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తిచుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను.

ప్రశ్నలచేత
కీర్తనల గ్రంథము 49:4

గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచెదను.

కీర్తనల గ్రంథము 78:2

నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను.

సామెతలు 1:6

వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.

మత్తయి 13:11

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.

మత్తయి 13:35

అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

ఒంటెలమీద
కీర్తనల గ్రంథము 72:10

తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.

కీర్తనల గ్రంథము 72:15

అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు.

యెషయా 60:6

ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

గంధవర్గములను
2 దినవృత్తాంతములు 9:9

ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.

మత్తయి 2:11

తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.

ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను
1 సమూయేలు 1:15

హన్నా అది కాదు , నా యేలినవాడా , నేను మనో ధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.

కీర్తనల గ్రంథము 142:2

బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను.

మత్తయి 12:34

సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.