శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రముచేసిరి
వీరు వంతుచొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.
ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కనిపెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు
హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.
మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము;
నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.
ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.
వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.
మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను.
నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.
మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.
యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.
యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.
మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.
ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.
ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.
అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.
ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి
ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.
ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.
శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.
వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.
యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.