
ఆ నాలుగు జీవులు- ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి- భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు
సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి -ఆమేన్;
యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి -ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.
తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల ? నీ సహోదరుని నిరాకరింప నేల ? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము.
నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును ,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు
అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను .
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,
భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.
వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.
సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.
బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.
మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.