తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.
ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా
యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.
మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలైయుండవలెననెను.
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.
యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటివారము? మామీద సణుగనేల అనిరి.
మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని
నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.
ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి.
సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.
వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.
వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.
అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి.
వారు విధేయులగుటకు మనస్సులేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.
వారు ఒక పోతదూడను చేసికొని ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను
వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొనిపోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.
వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.
నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.
ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.
వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగాచేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా
పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.
వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.
ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడాయనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.
ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.
యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను.
వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మికయుంచలేదు..
అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్షద్వారములను తెరచెను
ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.
దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.
వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను . ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను .
బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను .
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.
యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి.
కాగా మోషే యెహోవాతో యిట్లనెను నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?
నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.
ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.
గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును .
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడినవారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.
ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
వారి యావ ద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వ దినము లన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే ; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు
ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని
యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.