నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.
తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను.
సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు.
విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరు వారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.
నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కులేనివానికి నేను మార్గదర్శినైతిని.
దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
యెహోవా , వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు
ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.
యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడి పించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయ కుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి , మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ దలచకుడి .
తీర్పు తీర్చుటకై నేను మీయొద్ద కు రాగా, చిల్లంగివాండ్రమీదను వ్యభిచారులమీదను అప్రమాణికులమీదను , నాకు భయ పడక వారి కూలివిషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.