యెహోవా నిరంతరము రాజై యున్నాడు ఆయన దేశములోనుండి అన్యజనులు నశించిపోయిరి.
నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు.యెహోవా నిరంతరమును ఏలువాడు.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును . దాని కెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు ; అది ముందు చెప్పిన రాజ్యము లన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును .
నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను . ఆయనే జీవముగల దేవుడు , ఆయనే యుగయుగములుండువాడు , ఆయన రాజ్యము నాశనము కానేరదు , ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను . ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగి పోదు ; ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు .
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు -ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.
సీయోనూ , సువార్త ప్రటించుచున్నదానా , ఉన్నత పర్వతము ఎక్కుము యెరూషలేమూ , సువార్త ప్రకటించుచున్నదానా , బలముగా ప్రకటించుము భయ పడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము .
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
అన్యులికమీదట దానిలో సంచరింప కుండ యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును ; మీ దేవుడనైన యెహోవాను నేనే , నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు .