యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.
అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులునుమీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు;మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.
ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడనుండి సహాయము చేయుచువచ్చిరి.
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త యైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.
అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును,శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా
నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము
పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా.
అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగాజెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగు యెహోవా వాక్కు.
మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.
నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకుఅధిపతియగు యెహోవా వాక్కు.
ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకుఅధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను; ఇదే సైన్యములకుఅధిపతియగు యెహోవా వాక్కు.
మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమి్మదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
సైన్యములకుఅధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞఇచ్చుచున్నాడు యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.
ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునా యని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి.
అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.
ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.
మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.
నీ వెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు-యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను.
అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొనవచ్చెను.
రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేము లో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనుని కి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.
మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,
మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను.
నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా
అతడు నాతో ఇట్లనెను-ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.
నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తరదేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణదేశములోనికి పోవును.
బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోకమందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.
అప్పుడతడు నన్ను పిలిచిఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము; అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి
వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి
అతనితో ఇట్లనుము-సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా-చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి, హేలెమునకును టోబీయాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును.
దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.
జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.
పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.
పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను
పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞఇచ్చియున్నాడు.
కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.
మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయముచేయవలెనని ఆజ్ఞాపించెను.
యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.
అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.
ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు