
నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.
నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గ మును దయచేయుదును.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను ? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే ,
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము ; దాని అంతము నిత్య జీవము .
కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.
మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.
మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీ పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.
ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.
యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చు వాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు .