నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను
ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,
వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను.
దావీదు -నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను .
ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును ; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ; ఇశ్రాయేలీయులలో దేవు డున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును .
ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా
యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.
మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమి్మకయుంచిరి.
గనుక ఏ స్థలములో మీకు బాకా నాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.
సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.
ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
ఇట్లుండగా ఏమందుము ? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు ?
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటి లో అత్యధిక విజయము పొందుచున్నాము.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగానుండును.
నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;
అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.
ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.
వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు
నీవు అహరోనును చూచి నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడవేయుమనుము; అది సర్పమగును.
కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్పమాయెను.
అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.
వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా
యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను
ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని
అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి.
కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసికొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును.
ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.
యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేకపోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.
జరిగినదానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.
అయితే ఐగుప్తీయులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.
యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమనుతించెదను.
యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.
ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి
అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.
యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును.
నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును.
నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను
తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.
నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.
నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.
జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.
ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు.భయము అధికభయము వారికి కలుగును.
యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
నీవు నీ ప్రజను తోడుకొనివచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను
నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు.యెహోవా నిరంతరమును ఏలువాడు.
ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి.
మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.
ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా
అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి,
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగ జేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.
ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.
ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను
ఐగుప్తులో తన సూచకక్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికితెచ్చుకొనలేదు .
ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను .
ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను .
వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడుచేసెను .
వారి పశువులను వడగండ్ల పాలుచేసెను . వారి మందలను పిడుగుల పాలుచేసెను .
ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను .
తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను .
ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను .