తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.
పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరిచూచుచున్నారు?
నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
యెహోవా హస్తము నా మీదికి వచ్చెను . నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి యెముకలతో నిండియున్న యొక లోయ లో నన్ను దింపెను . ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా
యెముకలనేకములు ఆ లోయ లో కనబడెను , అవి కేవలము ఎండిపోయినవి .
ఆయన నర పుత్రుడా , యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా ? అని నన్న డుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని .
అందుకాయన ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండిపోయిన యెముకలారా , యెహోవా మాట ఆలకించుడి .
ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ;
చర్మము కప్పి మీకు నరముల నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను ; మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రదుకుదురు ; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .
ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను ; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను .
నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను , వాటిపైన చర్మము కప్పెను , అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను .
అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.
ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.
అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును ; మృత్యువు నుండి వారిని రక్షింతును . ఓ మరణమా , నీ విజయ మెక్కడ? ఓ మరణమా , నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు .
ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.
ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.
మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టివారే.
మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము.
సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.
బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును .
యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమి్మనయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.