యెహోవాను ఆశ్రయించుడి ; అప్పుడు మీరు బ్రదుకుదురు , ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయ లేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును .
నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన
సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల
నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.
మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పించును.
నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచుకొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింపజేయును.
మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.
అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును.
నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుందువు.
సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా
తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడైయుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను.
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహో వాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.
దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.