
మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగానుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
మేఘాంధకారములు ఆయనచుట్టునుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము .
అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది .
ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.
పూర్వమునుండి తోపెతు1 సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.
ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.
అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.
ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను.
మీకాయా యిట్లనెను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని
దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
కొండలమధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయి నట్లు మీరు పారిపోవుదురు , అప్పుడు నీతోకూడ పరిశుద్దు లందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును .
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.
యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక .
పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక . వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.
భూజనులకు తీర్పుతీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పుతీర్చును .
అప్పుడు , యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరి తో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను . మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను .
నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించు నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .
అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవిం చనివారెవరో మీరు తిరిగి కనుగొందురు .
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
సముద్రము తనలోఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.