
అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు , వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గములయందు ప్రవర్తించితివి.
యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.
యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.
ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.
మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని
యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి
తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి
చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.
అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,
వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.
వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి.
మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.
కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.
అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి .
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు , పక్షులయొక్కయు , చతుష్పాద జంతువులయొక్కయు , పురుగులయొక్కయు , ప్రతిమాస్వరూపముగా మార్చిరి .
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి , తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను .
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి , సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి . యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు , ఆమేన్ .
మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.
ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.
అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి.
వారు విధేయులగుటకు మనస్సులేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.
వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి
యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.
యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు?
నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.
ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.
అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి .