
సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?
అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి?
ఐశ్వర్యముపొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును.
ఆహారము కానిదానికొరకు మీ రేల రూక లిచ్చెదరు ? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి .
జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.
చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజన మేమి ? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ?
ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?
మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును?
క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.
వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.
ఇంకను పుట్టని వారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని.
నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.
నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?
జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.
అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.
జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా
దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసికొంటిని.
అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను.