
నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;
మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.
నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తిపొందరు.
నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల
నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.
నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.
నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడుచేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.
నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.
జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.
మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.
అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.
మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.
తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేకపోయెదరు.
మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.
మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.
వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు
నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,
నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.
వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు.
అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.
నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.
యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.
నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింపజేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.
యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.
విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చుకొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.
ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.
ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.
కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.
మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.
మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.
అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.
మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్యయెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున
అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలినదేమియు ఉండదు.
నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును
అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారముచేతను నేలమీద తన అరకాలు మోపతెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటియెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తెయెడలనైనను కటాక్షము చూపకపోవును.
నీవు జాగ్రత్తపడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల
యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునైయుండును.
నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.
మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.
అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును , అర పావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.
అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా , సహాయము చేయుమని కేకలు వేయుట విని
యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండియైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.
మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.
దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను
ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి
నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీయందు భయభక్తులు కలిగి
నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.
నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.
ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను ,
అవి వారిదేశపు కూరచెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను .
ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగాయెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,
యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమి్మదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చిదాని ముట్టడివేయగా
సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమి్మదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతు లందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు
గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి .పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి .
మత్తులారా , మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారస పానము చేయువారలారా , రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను ,
లెక్క లేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది .
అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసి యున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.