
కీడు వలన జయింప బడక , మేలు చేత కీడును జయించుము .
నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.
యేసు–తండ్రీ , వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను . వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము;
దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.
ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.