గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.
కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుని తో సమాధానము కలిగియుందము
మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై , అందులో నిలిచియుండి , దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము .
ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,
దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
ఇశ్రాయేలునకు కాపరీ , చెవియొగ్గుము.మందవలె యోసేపును నడిపించువాడా , కెరూబులమీద ఆసీనుడవైనవాడా , ప్రకాశింపుము .
ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము .
దేవా , చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము .
రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటనంగీకరించిన యెడల ఎంత మేలు.
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము .
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి .
గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును .
మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్ట లన్నిటిమీద వారికి మేపు కలుగును
వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగు లదు .
తమ గొఱ్ఱెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
తప్పిపోయిన దానిని నేను వెదకుదును , తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును , దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును ; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను .
నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు .