సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
మూలకుగాని పునాదికిగాని నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు నీవు చిరకాలము పాడైయుందువు ఇదే యెహోవా వాక్కు.
భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజ లాడుచున్నది ఒక్క నివాసియు లేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను.
ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
యెహోవా వాక్కు ఇదేడెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.
మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియునగును.
యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీగతి పట్టినదా? అందురు
సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.
బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.
కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు.
నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి
నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.
అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను -మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి -ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగానుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడు గాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.
యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేతవారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.
త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు
నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియ లన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను .
నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.