
వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,
మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడై పోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరుపట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.
వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.
సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనే మాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.
బయటి పొలములో నున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోనురాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి
బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును.
మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును.
అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతులయొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును.
అతడు తన గుఱ్ఱముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును.
వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.
ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,
నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.
సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడినవారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.
వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసు లందరిని భీతిల్ల చేసినది ఇదే.
ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదలుచున్నవి.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులు లేని పట్టణములవలెనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతనకాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితో కూడ నిన్ను నివసింప జేసెదను.
మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;
నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.
యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.
ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారి నందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.
తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును, నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గముచేత వారు హతులగుదురు, నేను ప్రభువగు యెహోవానని
అక్కడ ఉత్తరదేశపు అధిపతు లందురును సీదోనీయు లందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.
తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా?
నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి
యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.
ఇదిగో మీరు చేసినదానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును
మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును; వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే.
దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.
దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.
ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను.
ఆమె ¸యవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.
యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.
నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;
దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి