ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.
త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
దేశమా, దాసుడు నీకు రాజై యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.
దేశమా, నీ రాజు గొప్పయింటి వాడైయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై యుండుటకు నీకు శుభము.
మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి ; రాజు తానే అపహాసకులకు చెలికాడాయెను.
పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి యంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది .
తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి .
అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు , కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు , కలహమైనను మత్సరమైనను లేకయు , పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము .
దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.
వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషములతోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.
ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.