జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.
తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.
ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను -వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.
జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.