మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.
ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి,
నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు.
వారు అందులో నిర్ఛయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు , వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారి కందరికి నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించుకాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు .
రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు ; విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును , కొండ లన్ని రసధారలగును ; ఇదే యెహోవా వాక్కు .
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును , పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు , ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు , వనములు వేసి వాటి పండ్లను తిందురు .
వారి దేశ మందు నేను వారిని నాటుదును , నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు .
నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.
దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.
సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.
అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి.
పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి.
ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలముపొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను .
భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా , సిగ్గునొందుడి .ద్రాక్షతోట కాపరులారా , రోదనము చేయుడి .
ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడిపోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్ల న్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను .
కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.
నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును.
తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.
మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమి్మదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.
కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయినను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
సమాధానసూచకమైన ద్రాక్షచెట్లు ఫల మిచ్చును , భూమి పండును , ఆకాశమునుండి మంచు కురియును , ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.¸
కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యభాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును.