మూడవనాటికి సిద్ధముగానుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమైయుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను.
గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.
జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.
దేవుడు తేమాను లోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారాను లోనుండి వేంచేయు చున్నాడు .(సెలా .) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది .
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
యెహోవా మోషేతో ఇట్లనెను ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.
నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.
అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా
యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.
మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను.
యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.
ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.
మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి
మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి.
కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చనిపోదుము.
మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను?
స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును,
బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక,
ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి.
మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణకుచున్నాననెను.
ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,
క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పినవానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.
అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.
మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?
కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,
నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.
యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.
నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని . ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును .
మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని .
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుస రింపక , తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి , నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా , అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని .
కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది , ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.
ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా ? అట్లనరాదు . అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు , పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాప మగు నిమిత్తము, అది నాకు మరణకర మాయెను .
ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము ; అయితే నేను పాపము నకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను .
నీ వాక్యసారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.