
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.
నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు;
నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱ మేకల మందలు దీవింపబడును;
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.
నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరివచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.
నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.
భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు.
మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.
యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు
నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రిందివాడవుగా ఉండవు.
నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;
మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా నీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచినట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము.
నీ తండ్రియైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చినదంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన యెడల
నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.
అయితే మీరేగాని మీ కుమారులే గాని యేమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజించినయెడల
నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా
జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను.
సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించినదానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.
మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి .యెహోవాను స్తుతించుడి .
నా ఆత్మను మీ యందుంచి , నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.
నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.