
ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.
మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా
మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.
మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
అయితే ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికిఅర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.
సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి
మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.
ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.
మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు.
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.
ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.
ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.
ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.