యెహోవా మోషేతో యిట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.
కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.
వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.
నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్యాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి.
అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషు కొండకు ఉత్తరదిక్కున నున్నది.
ఆ తరమువారందరు తమ పితరులయొద్దకు చేర్బబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా
ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి
తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.
వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.
యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.
కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను
ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.
కాగా యెహోవా మోషే తో ఇట్లనెను నీవు దిగి వెళ్లుము ; ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి .
గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి ; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.
మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.
కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.
అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.
మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను.
వారు తమ పితరులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన నాటనుండి నేటివరకు నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరిచేత దోచబడి నష్టము నొందుదురు.
మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడునడతనడిచి, యూదా వారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.
అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.
మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.
అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.
వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?