మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.
అందుకు యేసు అతనితో ఇట్లనెనుఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.
కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది.
అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు2 అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.
అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమి్మ, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.
కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కినాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా
ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.
అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు3 అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను
అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని
వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.
కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.
అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;
నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.
అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని నప్పగించెను.
మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.
దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.
దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.