మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.
మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము.
నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను యెహోవాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,
ఏడు గొఱ్ఱ పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
ఇశ్రాయేలీయులందరును ఆర్బాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.
వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.
ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.
బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
ఏడవ నెల పదియవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.