ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును .
వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.
మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.