దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు.
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును
బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలుడాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.
అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.
నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు
వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
ఇందును గూర్చి భూమి కంపించదా ? దాని నివాసు లందరును అంగలార్చరా ? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును , మిస్రయీము దేశపునదివలె అది అణగిపోవును .
బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.
బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటులను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు.
దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు.
ఈలాగున నీవు ప్రకటింపవలెను యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.
ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి
నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీగతి పట్టినదా? అందురు
అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.
బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగుదురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయమొందును.
అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.
అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు
నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.
కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.
తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.
నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.
సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు.
కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు .
నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికర పడక వృద్దుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి .
నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింప కపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి .
కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూ డనని అనుకొనుచున్నదానా , ఈ మాటను వినుము
ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును . నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును .
నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను .
కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించ లేవు నీకు తెలి యని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును .
నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతు వేమో
నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
వారు కొయ్యకాలు వలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు .
అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను -మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి -ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.