అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?
కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?
షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను.
కావున సీయోను కొండమీదను యెరూషలేముమీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.
అతడునేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని
పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును.
అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా ?
నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా ?
హమాతు రాజు ఏమాయెను ? అర్పాదు రాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి
హిజ్కియా దూతల చేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.
నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమై నందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను.
కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను.
ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.
ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను.
దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు.
విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగా రించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షము లన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను .
కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి , తన కొన మేఘముల కంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను .
కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమివేసి , జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను ; ఆ జనము అతనికి తగినపని చేయును .
జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి , కొండలలోను లోయ లన్నిటిలోను అతని కొమ్మలు పడెను , భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూ జను లందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.
పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షు లన్నియు దిగి వ్రాలును, అతని కొమ్మల మీద భూ జంతువు లన్నియు పడును .
నీరున్నచోటున నున్న వృక్షము లన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయపడి , తన కొనను మేఘముల కంటజేసి , యే వృక్షముగాని దాని యెత్తునుబట్టి గర్వింప కుండునట్లు , క్రిందిలోకమునకుపోవు నరుల యొద్దకు దిగు వారితోకూడ మరణము పాలైరి .
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, అగాధజలములు అతని కప్పజేసితిని , అనేక జలములను ఆపి అతనినిబట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని , అతనికొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసితిని, ఫలవృక్షము లన్నియు అతనిగూర్చి వ్యాకులపడెను , పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవువారియొద్దకు అతని పడవేయగా
అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని , నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షము లన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి .
అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితోకూడ పాతాళమునకు అతడు హతము చేసినవారి యొద్దకు దిగిరి .
కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు ? నీవు పాతాళము లోనికి త్రోయబడి , ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారి యొద్దను నీవు పడియున్నావు . ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
రాజు -బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలా ధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను .
జనులు ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.
అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
వారు తమ దురాశలచొప్పున నడుచుచు,లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.
అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు ; అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు .
అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహా రాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి?
యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే . ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?
నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసి పోవును . ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికిని అట్టివాడే.
మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. -- యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా?
కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న యెడల నేను వాటిని నీకిచ్చెదను .
అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు ? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే .
యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా ? లేదు; ఆ దేశము మీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను.
హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము , నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారము మీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట లాడకుమని రబ్షాకే తో అనగా
రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా ? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారము మీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి
గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను మహా రాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి . రాజు సెలవిచ్చినదేమనగా
హిజ్కియాచేత మోస పోకుడి ; నా చేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు .
యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును , ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే .
హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింప వద్దు ; అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.
అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు , అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును , ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమునకును ,ఒలీవ తైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను విన వద్దు .
ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా ?
హమాతు దేవతలు ఏమాయెను ? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను ? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా ?
యెహోవా మా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.
అయితే అతనికి ప్రత్యుత్తర మియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తర మియ్యక ఊరకుండిరి .
గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును , శాస్త్రియగు షెబ్నాయును , రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును , బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి , రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము.
మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.
మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమి్మకయుంచిరి.
ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను
అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమి్మ మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు?
మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?
కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి,యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.
అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.
నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచనచేయుచున్నారు.
దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.