పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటికావు.
నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుటచేత మూఢులు చనిపోవుదురు.
జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.
బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు.
అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.
అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును.
సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.
అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.
జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.
వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు ?
ప్రకటించువారు పంప బడని యెడల ఎట్లు ప్రకటించుదురు ? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదము లెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.