నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయము కట్టించుట నీచేతకాదు.
ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.
నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్టకుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితో నైనను నేనొక మాటయైన పలికియుంటినా?
కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱల దొడ్డినుండి తీసికొని
నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగజేయుదును
మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమపెట్టకుందురు;
నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియు గాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.
నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.
అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించినవాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి.
నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రువులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.
అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.
నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.
పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.
అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును
వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.
మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను.
మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను.
బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,
సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని,
ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,
ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతని కప్పగించెను.
ఇవియన్నియు అప్పగించి యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను.
మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగానీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.
దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకారము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పనియంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులును జనులందరును నీకు సహాయులగుదురు.
మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.
నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక
ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను.
అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగా నా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని
నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.
తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.
రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.
మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.
అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.
ఏర్పాటైన ప్రతిమనిషి వెండివస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.
హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమియందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణమొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమునుబట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా,
మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడువారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును.
మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొనిపోవలెను.
మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును, జనులును యాజకులును యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొనిపోవలెను.
తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱపిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠముమీద వాటిని అర్పించుము.
మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీవారికిని యుక్తమని తోచినదానిని చేయవచ్చును.
మరియు నీ దేవుని మందిరపు సేవకొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని యెదుట అప్పగింపవలెను.
నీ దేవుని మందిరవిషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసినయెడల అది రాజుయొక్క ఖజానాలోనుండి నీకియ్యబడును.
మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యముకాకుండ మీరు దాని చేయవలెను.
వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.
ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారులమీదికిని కోపమెందుకు రావలెను?
మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.
మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియనివారెవరో వారికి నేర్పవలెను.
నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణశిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.
యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను,రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.
నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగాఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.
పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.
ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.
నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?
నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.