జ్ఞాపకము చేసి కొనుము
కీర్తనల గ్రంథము 74:18
యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము.
కీర్తనల గ్రంథము 79:8-12
8
మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
9
మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
10
వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్త మునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.
11
చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.
12
ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము.
నిర్గమకాండము 17:14

అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము.

1 సమూయేలు 15:2

సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే , వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.

హొషేయ 7:2

తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను-మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసి కొనడని తమలో తాము అనుకొందురు.

పసిపిల్లలను
యెషయా 63:1-6
1
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు చున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.
2
నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?
3
ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట లన్నియు డాగులే.
4
పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను
5
నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.
6
కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.
యిర్మీయా 49:7-22
7

సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

8

ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయులారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగుకొనుడి.

9

ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?

10

నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు, అతడును లేకపోవును.

11

అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.

12

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగు చున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.

13

బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

14

యెహోవా యొద్దనుండి నాకు వర్తమానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.

15

జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.

16

నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.

17

ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.

18

సొదొమయుగొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.

19

చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరియేడి?

20

ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాసస్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.

21

వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.

22

శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

విలాపవాక్యములు 4:21

అతని నీడక్రిందను అన్యజనుల మధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవునునీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు

విలాపవాక్యములు 4:22

సీయోను కుమారీ, నీ దోషశిక్ష సమాప్తమాయెను ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఎదోము కుమారీ, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును.

యెహెజ్కేలు 25:12-14
12

మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చుకొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

13

ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును,దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

14

నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నా కోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

ఓబద్యా 1:10-14
10

నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.

11

నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసికొంటివి గదా.

12

నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశనదినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;

13

నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;

14

వారిలో తప్పించుకొనినవారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదినమందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింపతగదు.

ఓబద్యా 1:18-21
18

మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.

19

దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు.

20

మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెరపట్టబడినవారు సారెపతువరకు కనానీయులదేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు.

21

మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాదియగును.