మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు.
ప్రభువా , నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.
ప్రభువా , దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు .
నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు
మింటను యెహోవాకు సాటియైనవాడెవడు ? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు ?
యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు .
జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు .
ఏలయనగా యెహోవా , భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవైయున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు .
ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
ఆయన భూ మండలము మీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాసస్థలముగా ఏర్పరచెను.
నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు ? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు .
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
మీరు వారితో ఈలాగు చెప్పవలెనుఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండ కుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.
కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ; ఏదనగా , ఇవి్వధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు . కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు , మేషాకు , అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును ; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండు ననెను .
నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను . ఆయనే జీవముగల దేవుడు , ఆయనే యుగయుగములుండువాడు , ఆయన రాజ్యము నాశనము కానేరదు , ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
ఆయన విడిపించువాడును రక్షించువాడునైయుండి , పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు . ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.