నాకు బుద్ధి దయ చేయుము
కీర్తనల గ్రంథము 119:73

(యోద్‌) నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయచేయుము.

కీర్తనల గ్రంథము 111:10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములననుసరించువారందరు మంచి వివేకముగలవారు . ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది .

యోబు గ్రంథము 28:28

మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.

సామెతలు 2:5

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

సామెతలు 2:6

యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

యోహాను 7:17

ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.

యాకోబు 1:5

మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

యాకోబు 3:13-18
13

మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

14

అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15

ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

16

ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17

అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనిన

18

నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

నేను దాని ప్రకా రము నడుచుకొందును
ద్వితీయోపదేశకాండమ 4:6

ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.

మత్తయి 5:19

కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.

మత్తయి 7:24

కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

యాకోబు 1:25

అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

యాకోబు 2:8-12
8

మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.

9

మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

10

ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;

11

వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధివైతివి.

12

స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.

యాకోబు 4:11

సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.

నా పూర్ణహృదయముతో
కీర్తనల గ్రంథము 119:10

నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.

కీర్తనల గ్రంథము 119:58

కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.

కీర్తనల గ్రంథము 119:69

గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును.