మోయాబీయులకు
సంఖ్యాకాండము 21:29

మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను.

సంఖ్యాకాండము 22:1-41
1

తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.

2

సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను.

3

జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి.

4

మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.

5

కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.

6

కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.

7

కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా

8

అతడు వారితో యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి.

9

దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న యీ మనుష్యులుఎవరని అడుగగా

10

బిలాము దేవునితో యిట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు

11

చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.

12

అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.

13

కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా

14

మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి బిలాము మాతో కూడ రానొల్లడాయెననిరి.

15

అయినను బాలాకు వారి కంటె బహు ఘనతవహించిన మరి యెక్కువమంది అధికారులను మరల పంపెను.

16

వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.

17

నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.

18

అందుకు బిలాము బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.

19

కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.

20

ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను.

21

ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను.

22

అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.

23

యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా

24

యెహోవా దూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను.

25

గాడిద యెహోవా దూతను చూచి గోడమీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను.

26

యెహోవా దూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా

27

గాడిద యెహోవా దూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.

28

అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా

29

బిలాము నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.

30

అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడులేదనెను.

31

అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా

32

యెహోవా దూత యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.

33

ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను.

34

అందుకు బిలాము నేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా

35

యెహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను.

36

బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా

37

బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను.

38

అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.

39

అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్‌హుచ్చోతుకు వచ్చినప్పుడు

40

బాలాకు ఎడ్లను గొఱ్ఱలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను.

41

మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.

సంఖ్యాకాండము 24:1-25
1

ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.

2

బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను

3

గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త.

4

అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

5

యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.

6

వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.

7

నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతని రాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును.

8

దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి యెముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును.

9

సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును.

10

అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము.

11

నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను.

12

అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టముచొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.

13

యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా?

14

చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి

15

ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి.కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి.

16

దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

17

ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.

18

ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును.

19

యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.

20

మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే.

21

మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను నీ నివాసస్థలము దుర్గమమైనది.నీ గూడు కొండమీద కట్టబడియున్నది.

22

అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా?

23

మరియు అతడు ఉపమానరీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రదుకును?

24

కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.

25

అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్లెను; బాలాకును తన త్రోవను వెళ్లెను.

ద్వితీయోపదేశకాండమ 2:9

మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.

ద్వితీయోపదేశకాండమ 2:19

వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.

ద్వితీయోపదేశకాండమ 23:3

అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

న్యాయాధిపతులు 3:1-31
1

ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని చూడనివారందరిని శోధించి

2

ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి.

3

ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును,

4

యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనునట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను.

5

కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు

6

పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులను జనులమధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లిచేసికొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెల నిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి

7

అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి.

8

అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమి్మవేసెను. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగానుండిరి

9

ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.

10

యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.

11

అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.

12

ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను.

13

అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.

14

ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.

15

ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పనివాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా

16

ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్రములో తన కుడి తొడమీద

17

దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.

18

ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి.

19

గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చిరాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడుతనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.

20

ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదు నీతో నేను చెప్పవలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను.

21

అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.

22

పడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వుకత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చియుండెను.

23

అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.

24

అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకొని

25

తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.

26

వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారిపోయెను.

27

అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్యప్రదేశమునుండి దిగి అతని యొద్దకు వచ్చిరి.

28

అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి; మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.

29

ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.

30

అతనితరువాత అనాతు కుమారుడైన షవ్గురు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందల మందిని మునుకోల కఱ్ఱతో హతముచేసెను;

31

అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.

రూతు 4:10

మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును , చనిపోయినవాని పేరు అతని సహోదరులలో నుండియు , అతని స్థలముయొక్క ద్వారము నుండియు కొట్టివేయబడక యుండునట్లును , నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను . దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను .

2 సమూయేలు 8:1-18
1

దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.

2

మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

3

సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి

4

అతనియొద్దనుండి వెయ్యిన్ని యేడు వందల మంది గుఱ్ఱపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని, వారి గుఱ్ఱములలో నూటిని ఉంచుకొని, మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను.

5

మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేల మందిని ఓడించి

6

దమస్కువశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా,సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

7

హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

8

మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన యిత్తడిని పట్టుకొనెను.

9

దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను.

10

హదదెజెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి యుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను.

11

రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.

12

వాటిని అతడు సిరియనులయొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబారాజునొద్ద నుండియు పట్టుకొని యుండెను.

13

దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.

14

మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

15

దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనులనందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.

16

సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.

17

అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;

18

యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.

2 రాజులు 3:1-27
1

అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదు నెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పం డ్రెండు సంవత్సరములు ఏలెను .

2

ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక , తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను

3

ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడు వక చేయుచునే వచ్చెను.

4

మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగలవాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు .

5

అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజుమీద తిరుగుబాటు చేయగా

6

యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని సమకూర్చెను .

7

యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి మోయాబు రాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే , నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే ; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను .

8

మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.

9

ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను .

10

ఇశ్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా

11

యెహోషాపాతు అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను . అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా

12

యహోషాపాతు యెహోవా ఆజ్ఞ యితని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా

13

ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి ? నీ తలి దండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను .ఆలాగనవద్దు , మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా , రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు

14

ఎలీషా ఇట్లనెను ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో , ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును .

15

నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసికొనిరమ్ము . వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.

16

యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి ;

17

యెహోవా సెలవిచ్చునదేమనగా గాలియే గాని వర్షమే గాని రాక పోయినను , మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును .

18

ఇది యెహోవా దృష్టికి అల్పమే , ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును .

19

మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి , మంచి చెట్ల నెల్ల నరికి , నీళ్ల బావు లన్నిటిని పూడ్చి , సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను.

20

ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్ల తో నిండెను .

21

తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని , అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దు నందు నిలిచిరి .

22

ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా , అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను

23

గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరి నొకరు హతము చేసికొని నిజముగా హతులైరి ; మోయాబీయులారా , దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి .

24

వారు ఇశ్రాయేలువారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి ; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.

25

మరియు వారు పట్టణములను పడగొట్టి , సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి , నీళ్ల బావు లన్నిటిని పూడ్చి , మంచి చెట్లన్నిటిని నరికివేసిరి . కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి.

26

మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు ఏడు వందల మందిని ఏర్పరచుకొని, ఎదోము రాజు నొద్దకు తీసికొని పోవుటకు యత్నించెను గాని అది వారివలన కాకపోయెను .

27

అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసికొని , పట్టణపు ప్రాకారము మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి .