
ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.
నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు .
వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు
నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు.
దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి , మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమానిరాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి .
అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని . దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి , కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి .
నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.
అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ , కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.
పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని .