
సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమి్మదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
నాల్గవ నెల తొమ్మీదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా-నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.
నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తిపొందరు.
మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.
అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.
దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటు కొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.
సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంటకుప్పలను కౌగిలించుకొనెదరు.
నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.
దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.
అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.
వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.
మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడు వందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;
నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళ వేళకు తినవలెను,
నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేళ వేళకు త్రాగవలెను;
యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;
నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.
అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడ లేదే అని నేననగా
ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గో మలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి
నర పుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.
అన్న పానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకని నొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.
కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.
కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలు దిశల చెదరగొట్టి తరుముదును.
బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును.
ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు
కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా