నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను.
యెహొషువ 6:18

శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.

యెహొషువ 7:11-13
11

ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.

12

కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.

13

నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుము రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు; మీరు దానిని మీ మధ్య నుండకుండ నిర్మూలము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు.

న్యాయాధిపతులు 20:26

వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి.

2 దినవృత్తాంతములు 19:4

యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.

2 దినవృత్తాంతములు 20:3-13
3

అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా

4

యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.

5

యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి

6

మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.

7

నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.

8

వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను,మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల

9

నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.

10

ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగిపోయిరి.

11

మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము.

12

మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.

13

యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.

2 దినవృత్తాంతములు 31:20

హిజ్కియాయూదా ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.

2 దినవృత్తాంతములు 31:21

తన దేవుని ఆశ్రయించుటకై మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగాజరిగించి వర్ధిల్లెను.

2 దినవృత్తాంతములు 32:1-22
1

రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత... అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొరబడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.

2

సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధము చేయనుద్దేశించి యున్నాడని హిజ్కియా చూచి

3

పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి,తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.

4

బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుకనేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారుచున్న కాలువను అడ్డిరి.

5

మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.

6

జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను

7

మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.

8

మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమి్మకయుంచిరి.

9

ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను

10

అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమి్మ మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు?

11

కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?

12

ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసివేసినవాడుకాడా?

13

నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

14

మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?

15

కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి,యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.

16

అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.

17

అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.

18

అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.

19

మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.

20

రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా

21

యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.

22

ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున

లూకా 3:14

సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.

ప్రకటన 19:11-14
11

మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12

ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

13

రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

14

పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి.